ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు

ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు

వరంగల్ టైమ్స్, తాడేపల్లి : గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ కూల్చివేతలు ప్రారంభమయ్యాయి. ఇంటి ప్లాన్లను అతిక్రమించి ప్రహరీ గోడలు నిర్మించారని అధికారులు వాటి కూల్చివేతను చేపట్టారు. 12 ఇళ్ల ప్రహరీ గోడలను నగరపాలక సంస్థ అధికారులు రెండు జేసీబీల సాయంతో కూలగొట్టారు. కూల్చివేతలను అడ్డుకొంటూ గ్రామస్థులు నిరసన వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నిరసనల మధ్యే సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసులు మోహరించారు. గ్రామ సరిహద్దుల్లో పహారా పెట్టారు. గ్రామంలోకి వచ్చేవారిని తనిఖీ చేసి, వారి వివరాలను నమోదు చేసుకొని గ్రామంలోకి అనుమతిస్తున్నారు.

ఆటో, బస్సు సౌకర్యం కూడా లేని గ్రామంలో 70 అడుగుల రోడ్డును విస్తరించి ఏం సాధిస్తారని గ్రామస్థులు వాపోతున్నారు. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు నరసింహారావు నివాసాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో ప్రహరీ వరకే కూల్చేసి వదిలేశారు. నగరపాలక సంస్థ అధికారుల చర్యలకు కొంతమంది ముందస్తుగా న్యాయస్థానం నుంచి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు.