కండలు పెంచేందుకు స్టెరాయిడ్స్..ముగ్గురు అరెస్ట్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : వేగంగా కండలు పెంచుకోవచ్చని ఆశ చూపుతూ జిమ్ లలో హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సౌత్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ చక్రవర్తి గుమ్మి కథనం ప్రకారం.. సనత్ నగర్ కు చెందిన డైసెటి ఓం ప్రకాష్ అమీర్ పేట్ లో ప్రోటీన్ సప్లమెంటరీ వ్యాపారం చేస్తుండగా, అంబర్ పేట్ కు చెందిన సరోడ్ నరేష్ సప్లమెంటరీ పౌడర్ సరఫరా , బార్కాస్ కు చెందిన సయ్యద్ ఫారేఖ్ చాంద్రాయణగుట్టలో జిమ్ ట్రైనర్ గా పనిచేస్తున్నారు.
అయితే ఓం ప్రకాష్ తన చిన్ననాటి స్నేహితుడైన విశాఖకు చెందిన అవినాష్ వద్ద తక్కువ ధరకు హార్మోన్ ఇంజక్షన్లు, టాబ్లెట్లు తీసుకుని ప్రోటీన్స్ సరఫరాదారుడు నరేష్ ద్వారా సయ్యద్ ఫరూఖ్ కు అందిస్తున్నాడు. అక్కడి నుంచి కస్టమర్లకు సరఫరా అవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎస్.రాఘవేంద్ర ఆధ్వర్యంలో బృందం ఎస్ఆర్ నగర్ పోలీసులతో కలిసి దాడులు జరిపి ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి రూ. లక్ష విలువైన 180 ఇంజక్షన్లు, 1100 టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన అవినాష్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.