ఉప్పల్ పై బొంతు రామ్మోహన్ గురి ! 

ఉప్పల్ పై బొంతు రామ్మోహన్ గురి !

 వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : గ్రేటర్ హైదరాబాద్ లో కీలకమైన నియోజకవర్గం ఉప్పల్. ఎందుకంటే ఉప్పల్ లో అన్ని జిల్లాలకు చెందిన ప్రజలు ఉంటారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు, కార్మికులు కూడా ఎక్కువ మందే ఉంటారు. కీలకమైన నాయకులు చాలామందికి ఈ నియోజకవర్గంలోనే నివాసాలుంటాయి. ఎందుకంటే హైదరాబాద్ దాటి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వెళ్లాలంటే ఉప్పల్ ను దాటుకునే వెళ్లాలి. అంతేకాదు ఈ మధ్య మెట్రో రాకతో ఉప్పల్ కు కనెక్టివిటీ పెరిగింది. ఉప్పల్ చుట్టుపక్కల కాలనీలు పెరిగాయి. రియల్ బూమ్ జోరందుకుంది.

* నాడు బేతి వైపు .. మరి నేడు ఎవరివైపో
ఈ పరిణామాల నేపథ్యంలో ఉప్పల్ ఎమ్మెల్యే అంటే చాలా చురుగ్గా ఉండాలి. ఎప్పుడూ జనంలో కనిపించాలి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగాలి. కానీ ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిలో మాత్రం అంత చురుకుదనం లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. 2018లో చాలా మంది నాయకులు గులాబీ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ సీఎం కేసీఆర్ బేతి సుభాష్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. ఆ సమయంలో బొంతు రామ్మోహన్ ఈ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేశారు. కానీ ఎందుకనో బీఆర్ఎస్ పెద్దలు బొంతును కరుణించలేదు. అన్నీ కలిసి రావడంతో బేతి సుభాష్ రెడ్డి ఇక్కడి నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కానీ ఆయనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం నిలుపుకోలేకపోయారన్న విమర్శలున్నాయి.* బేతి తీరుపై ప్రజల నుంచి వ్యతిరేకత
ఉప్పల్ నియోజకవర్గంలో చాలా సమస్యలున్నాయి. చాలా చోట్ల రోడ్ల పరిస్థితి బాగాలేదు. చిన్న వర్షం పడితే నీట మునిగే కాలనీలున్నాయి. దీనికి తోడు ట్రాఫిక్ సమస్య. డబుల్ బెడ్ రూంల గురించి పట్టించుకునే వారే లేరు. అయినా బేతి సుభాష్ రెడ్డి ఈ సమస్యలను పెద్దగా పట్టించుకోరన్న విమర్శ ఉంది. ఆ మధ్య వరదలొచ్చిన సమయంలోనూ సుభాష్ రెడ్డి తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. వరదల సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ఆయన వారిపైనే విరుచుకుపడడం కనిపించింది. ఈ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. దాంతో గ్రేటర్ ఎన్నికల్లో ఉప్పల్ పరిధిలో గులాబీ పార్టీ ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయింది.

ఇది చాలదన్నట్లు బొంతు రామ్మోహన్ సతీమణి, కార్పొరేటర్ బొంతు శ్రీదేవితోనూ సుభాష్ రెడ్డి వ్యవహరించిన తీరుపైన కూడా విమర్శల జడివాన రేగింది. ఇలాంటి అనేక అంశాల్లో బేతి సుభాష్ రెడ్డి తీరు వివాదాస్పదంగా ఉండడం హైకమాండ్ గమనించింది. అందుకే బీఆర్ఎస్ పెద్దలకు బేతి సుభాష్ రెడ్డిపై ఓ క్లారిటీ వచ్చేసిందట. ఆయన మారే పరిస్థితి లేకపోవడంతో మరోసారి టికెట్ ఇవ్వడంపై ఆలోచిస్తున్నట్లు టాక్.

* బొంతుకు ప్లస్ పాయింట్ గా మారనున్న బేతి తీరు !
ఎమ్మెల్యేగా బేతి సుభాష్ రెడ్డి తీరు సరిగా లేకపోవడం, హైకమాండ్ దగ్గర ఆయన చిట్టా మొత్తం ఉండడంతో బొంతు రామ్మోహన్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్. బీఆర్ఎస్ పెద్దలు కూడా సుభాష్ రెడ్డి కంటే బొంతు రామ్మోహన్ బెటర్ ఛాయిస్ అని భావిస్తున్నారట. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కు ధీటుగా బీజేపీ, కాంగ్రెస్ ఉన్నాయి.

*బొంతు వైపే అధిష్టానం చూపు !
ఉప్పల్ సెగ్మెంట్ లో బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ రేసులో ఉన్నారు. ఇక మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. కుదిరితే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ నుంచైనా ఆయన పోటీ చేసే అవకాశాలున్నాయని టాక్. దీంతో సుభాష్ రెడ్డి కంటే బొంతు రామ్మోహన్ అయితే బావుంటుందని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మరి బీఆర్ఎస్ హైకమాండ్ నిజంగానే సుభాష్ రెడ్డికి టికెట్ కట్ చేస్తుందా? బొంతు రామ్మోహన్ కు పెద్ద పీట వేస్తుందా? ఈ పోటీలో బీజేపీ, కాంగ్రెస్ కూడా సత్తా చాటుతాయా? అన్నది తేలాలంటే ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.