చేవెళ్లపై పట్టు కోల్పోయిన చెల్లెమ్మ!
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : చేవెళ్ల నియోజకవర్గం ఒకప్పుడు ఇంద్రారెడ్డి కుటుంబానికి కంచుకోట. 1985 నుంచి 2009 వరకు ఇంద్రారెడ్డి కుటుంబం హవానే నడిచింది. 1985 నుంచి 99 వరకు వరుసగా నాలుగుసార్లు ఇక్కడినుంచి ఇంద్రారెడ్డి విజయకేతనం ఎగరవేసింది.ఆ తర్వాత 2001లో ఇంద్రారెడ్డి రోడ్డుప్రమాదంలో కన్నుమూయడంతో సబితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2001 ఉప ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డి విజయఢంకా మోగించారు. 2004 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి, సత్తా చాటారామె. ఏకంగా వైఎస్ కేబినెట్ లో మంత్రిగా స్థానం సంపాదించారు. వైఎస్ ఏ కార్యక్రమం తలపెట్టినా చేవెళ్ల నుంచే శ్రీకారం చుట్టేవారంటే అప్పట్లో సబితకు ఎంత ప్రాధాన్యం ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కానీ 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో చేవెళ్ల ఎస్సీ రిజర్డుడ్ గా మారింది. సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గానికి మారిపోయారు. అప్పటి నుంచే చేవెళ్లలో ఇంద్రారెడ్డి కుటుంబం పట్టు క్రమంగా పోయింది.
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలిచిన కాలె యాదయ్యకు సబిత మద్దతు పలికినా, టీడీపీ అభ్యర్థి కె.ఎస్. రత్నం గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాలె యాదయ్యను విజయం వరించింది. రత్నంపై స్వల్ప మెజార్టీతో కాలె యాదయ్య గట్టెక్కారు. కానీ కొంతకాలానికే సబితకు కాదని, ఆయన టీఆర్ఎస్ కండువా వేసుకున్నారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున బరిలో నిలిచి కాలె యాదయ్య మరోసారి విజయకేతనం ఎగరవేశారు. రెండుసార్లు సొంతబలంతోనే యాదయ్య గెలిచారని టాక్. అంటే చేవెళ్లపై గతంలో లాగా ఇంద్రారెడ్డి కుటుంబ హవా లేదన్న విషయం స్పష్టమైంది.
చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ కావడంతోనే సబిత లైట్ తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. సబిత చేవెళ్లపై సీరియస్ నెస్ తగ్గించడంతో ఆమె వర్గంగా ముద్రపడిన నాయకులంతా చెల్లాచెదురయ్యారు. ఒకబలమైన వర్గంగా ఉన్న ఆయా నేతలంతా ఆసరా కోసం పార్టీలు మారక తప్పలేదు. దీంతో చివరకు సబితకు చేవెళ్ల నియోజకవర్గంపై పట్టు కోల్పోయే పరిస్థితి వచ్చేసింది. అందుకే ఒకప్పుడు చేవెళ్ల నుంచే ప్రస్థానాన్ని ప్రారంభించి, హోంమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించిన సబిత చివరకు చేవెళ్లపై పట్టును కోల్పోయే స్థితికి చేరుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
*బలం ఉన్న చోట నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఒకప్పుడు సబితా ఇంద్రారెడ్డి చెప్పినట్లే నడుచుకునే వారట. కానీ ఇప్పుడు కాలం మారింది. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యాదయ్య ఇప్పుడు సొంతంగా బలోపేతమయ్యారు. తనకంటూ సపరేట్ పాలిటిక్స్ చేస్తున్నారు. అన్నీ చూసి చూసి చివరకు సబిత కూడా గులాబీ పార్టీలో చేరి మంత్రి అయ్యారు. అయినా చేవెళ్లపై మాత్రం పట్టు సాధించలేకపోయారు. ఇప్పుడు ఆమె చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు తప్ప సొంత అడ్డాలో తనకంటూ ఒక వర్గాన్ని కాపాడుకోవడంలో మాత్రం విఫలయ్యారు.
అలాంటి వర్గం లేకపోవడం వల్లే 2014లో సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఎప్పుడు ఎవరితో అవసరం పడుతుందో తెలియదు, కాబట్టి బలం ఉన్నచోట నిర్లక్ష్యం పనికి రాదంటారు రాజకీయ విశ్లేషకులు. 2014 ఎంపీ ఎన్నికల్లో ఇలాంటి తప్పులు చేయకుంటే కార్తీక్ రెడ్డి గెలిచేవారని అప్పట్లో ప్రచారం జరిగింది. లేకపోతే చేవెళ్లను కనుసైగలతో శాసించిన ఇంద్రారెడ్డి కుమారుడికి ఓటమి ఏంటి? ఇది కచ్చితంగా స్వయంకృతాపరాధమేనన్న గుసగుసలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
* ఎప్పటిలాగే చేవెళ్లను నిర్లక్ష్యం చేసిన చెల్లెమ్మ
సబితా ఇంద్రారెడ్డి తమ కుటుంబం సొంతూరు కౌకుంట్లకు వెళ్లినా, చేవెళ్ల నియోజకవర్గ నేతలు, అనుచరుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదట. అటు సబిత గానీ, ఇటు కార్తీక్ రెడ్డిగానీ ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ఒకప్పుడు ఇంద్రారెడ్డి కుటుంబానికి వీరవిధేయులుగా ఉన్న నాయకులు చాలామంది వారి నుంచి దూరం జరిగారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంద్రారెడ్డి క్యాడర్ ఎవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పడం కూడా ఇప్పుడు కష్టంగా మారింది. సబిత మినిస్టర్ అయితే చేవెళ్లకు మంచిరోజులొస్తాయని ఆశించినా అదీ జరగలేదు.
ఎప్పటిలాగే చేవెళ్లను సబిత నిర్లక్ష్యం చేశారట. అందుకే వారంతా తలో పార్టీలో ఉంటూ తమకు నచ్చిన నాయకులకు పనిచేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఇక చేవెళ్లపై సబితా ఇంద్రారెడ్డి పట్టు కోల్పోయినట్లేనని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఎంత ఎస్సీ నియోజకవర్గం అయితే మాత్రం ఏళ్లుగా తమ వెంట నడిచిన సొంత క్యాడర్ కు సబిత భరోసా ఇవ్వలేకపోవడం సరికాదని పరిశీలకులు చెబుతున్నారు.
*ఇప్పుడైనా చేవెళ్లపై ఫోకస్ చేస్తే బాగుంటుందట
అసలే చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే సీటును ఆశిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. నిజంగానే అది జరిగితే చేవెళ్ల ఎంపీ సీటుకు బీఆర్ఎస్ తరపున సబితా ఇంద్రారెడ్డి కుటుంబసభ్యులు పోటీ పడే అవకాశం ఉంది. కనీసం ఈ అంచనాలను బేరీజు వేసుకొని అయినా చేవెళ్లపై సబిత ఫోకస్ చేయాలని గులాబీ శ్రేణులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా సబితా ఇంద్రారెడ్డి ఆలోచన మారుతుందా? చేవెళ్లపై ఫోకస్ చేస్త్తారా? లేక లైట్ తీసుకుంటారా? అన్నది వేచిచూడాలి.