అనంతలో టీడీపీ – వైఎస్సార్సీపీ రాళ్ల దాడి

అనంతలో టీడీపీ – వైఎస్సార్సీపీ రాళ్ల దాడి

వరంగల్ టైమ్స్, అనంతపురం : అనంతపురంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డాయి. దీంతో పట్టణంలోని క్లాక్‌టవర్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌, ఆయన కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నందిగామకు చెందిన హరికృష్ణారెడ్డి సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడమే ఈ వివాదానికి దారి తీసినట్టు తెలుస్తోంది. సోమవారం రాప్తాడు నియోజకవర్గ కేంద్రానికి వచ్చిన హరికృష్ణారెడ్డి అసభ్య పదజాలంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ తర్వాత తాను అనంతపురం క్లాక్‌ టవర్‌ వద్దకు వస్తున్నట్టు సవాల్‌ విసురుతూ వీడియోలను పోస్టు చేశారు.

ఇది చూసిన టీడీపీ కార్యకర్తలు అనంతపురంలోని క్లాక్‌టవర్‌ వద్దకు వచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. అనంతరం హరికృష్ణ క్లాక్‌ టవర్‌ వద్దకు వచ్చి లోకేశ్‌ను పరిటాల సునీతను, శ్రీరామ్‌ను ఉద్దేశించి విమర్శలు చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ టీడీపీ కార్యకర్తతో పాటు కానిస్టేబుల్‌ రామాంజనేయుల తలకు గాయాలయ్యాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.