ఫారెస్ట్ ఆఫీసర్లకు బ్యాడ్ న్యూస్ ! ఎందుకంటే ?
వరంగల్ టైమ్స్, పశ్చిమ గోదావరి జిల్లా : రాత్రి వేళ పాపికొండల్లో ఆహ్లాదకర వాతావరణంలో బస చేయాలనుకునేవారికి అటవీశాఖ అధికారులు బ్యాడ్ న్యూస్ తెలిపారు. రాత్రి వేళల్లో బసకు అనుమతి నిరాకరిస్తున్నట్లు హోటళ్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. లాంచీలలో విహరించవచ్చని, హోటల్స్‌లలో ఉండటానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తిస్తే అటవీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆదేశాలు పాటించకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. దీంతో రాత్రి బస చేయాలనుకునేవారికి నిరాశ ఎదురైంది.
అసలే సమ్మర్ కావడంతో కూల్‌గా ఉండే టూరిస్టు ప్రదేశాలకు వెళ్లేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగా పాపికొండలకు పర్యాటకుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సెలవు రోజుల్లో టూరిస్ట్‌లు పెద్ద ఎత్తున వస్తోన్నారు. రాత్రి ఇక్కడే బస చేస్తూ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే అలాంటివారికి అటవీశాఖ బిగ్ షాక్ ఇచ్చింది.
పాపికొండల్లో రాత్రి వేళల్లో హోటల్స్‌లలో బస చేయడానికి అనుమతి నిరాకరించింది. ఈ మేరకు అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హోటల్స్‌లలో రూమ్ బుకింగ్స్‌ను ఆపేయాలని యాజమాన్యాలను ఆదేశించింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఫారెస్ట్ యాక్ట్ చట్టం కింద కఠిన చర్యలు ఉంటాయని తెలిపింది. లాంచీలలో మాత్రమే విహరించేందుకు అనుమతి ఉంటుందని, రాత్రి బసకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. వన్యప్రాణుల సంరక్షణ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.
అయితే గతంలోనే రాత్రి బసకు అటవీశాఖ అనుమతి ఇవ్వలేదు. కానీ లాంచీ ఓనర్లు హైకోర్టును ఆశ్రయించి తాత్కాలికంగా పర్మిషన్ తెచ్చుకున్నారు. ఈ అనుమతి గడువు ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంటుంది. గత నెలతో గడువు ముగియడంతో పోలీసులు రాత్రి బసకు అనుమతి నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పాపికొండల్లోని కొల్లూరు హట్స్‌లో రాత్రి బస ఆగిపోయింది.
నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించడంతో ఎవరూ ఓపెన్ చేయడం లేదు. గుడువు ముగియడంతో మరోసారి హైకోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకునేందుకు లాంచీ ఓనర్లు ప్రయత్నాలు మొదలుపెట్టారు. త్వరలోనే హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశముంది. సమ్మర్లో పాపికొండల్లో రాత్రి బస చేయాలనుకునే పర్యాటకుల ఆశలు అటవీశాఖ ఆదేశాలతో ఆవిరయ్యాయి.