ఆనంద భాష్పాలతో వీడ్కోల్ పలికిన సానియా మీర్జా
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్ ను సక్సెస్ తో ముగించింది. ఎక్కడ టెన్నిస్ కెరీర్ ను ప్రారంభించిందో అదే స్థలంలో లాస్ట్ మ్యాచ్ ఆడేసింది. హైదరాబాద్ లోని లాల్ బహదూర్ టెన్నిస్ స్టేడియంలో జరిగిన ఎగ్జిబిషన్ మ్యాచ్ లో సానియా తన కెరీర్ కు గుడ్ బై చెప్పింది. దాదాపు 20 యేళ్ల క్రితం హైదరాబాద్ లోనే చారిత్రాత్మక డబ్ల్యూటీ సింగిల్స్ టైటిల్ తో ఆమె కెరీన్ మొదలుపెట్టింది. మ్యాచ్ అనంతరం సానియా ఆనందభాష్పాలతో టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది.
ఇక సానియా మీర్జా చివరి మ్యాచ్ ను చూడటానికి చాలా మంది క్రీడా ప్రముఖులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ మ్యాచ్ ను చూడటానికి వచ్చిన వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రోహన్ బోపన్న, యువరాజ్ సింగ్, రాబిన్ ఊతప్ప, అనన్య బిర్లా, హుమా ఖురేషి, దుల్కర్ సల్మాన్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, వి.శ్రీనివాస్ గౌడ్, సానియా బెస్ట్ ఫ్రెండ్స్ ఇవాన్ డోడిగ్, బెథానీ మాటెక్, కారా బ్లాక్, మరియన్ బార్టోలీ తదితరులు ఉన్నారు.
మ్యాచ్ అనంతరం తన వీడ్కోలు ప్రసంగంలో సానియా భావోద్వేగానికి గురైంది. 20 యేళ్లుగా భారత దేశం తరపున ఆడడమే తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని ఆమె పేర్కొంది. ‘మీ అందరి ముందు నా చివరి మ్యాచ్ ఆడేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నాను. నా చివరి మ్యాచ్ ను హైదరాబాద్ లోని నా ఇంటి ప్రేక్షకుల ముందు ఆడాలని నేను కోరుకున్నాను. నా కోరిక నెరవేర్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్’అని సానియా మీర్జా తెల్పింది.
తన వీడ్కోలు మ్యాచ్ ను చూసేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికి సానియా కృతజ్ఞతలు చెబుతూ భావోద్వేగానికి గురైంది. ఈ రోజు ఎమోషనల్ అవుతానని అనుకేలేదని కానీ ఇవి ఆనందభాష్పాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. తన లైఫ్ లో చాలా విషయాలు ఈ స్టేడియం నుంచే మొదలయ్యాయని సానియా తెల్పింది.