బండి సంజయ్ పై క్రిమినల్ కేసు నమోదు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై బీఆర్ఎస్ కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 354ఏ, 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే కాదు, హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ పై బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
కవితను కించపరిచేలా మాట్లాడిన సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కవితతో పాటు తెలంగాణ ఆడబిడ్డలందరికీ తక్షణమే బండి సంజయ్ క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. నోరు అదుపులో ఉంచుకోకపోతే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఓ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉండి ఇలా మాట్లాడటం సరికాదన్నారు.