సీఎం కేసీఆర్ కు స్వల్ప అస్వస్థత
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సీఎం కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. కడుపులో కొంత నొప్పిగా ఉందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆయనను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి సీఎంకు కావాల్సిన అన్ని వైద్య పరీక్షలు చేయించారు. సిటీ స్కాన్, ఎండోస్కోపీ పరీక్షలు కూడా నిర్వహించారు. ఈ పరీక్షలతో సీఎంకు కడుపులో చిన్న అల్సర్ ఉన్నట్లుగా తేలిందని వైద్యులు తెలిపారు. మందులతో ఆ అల్సర్ తగ్గిపోతుందని తెలిపారు. అల్సర్ మినహా అన్ని పారామీటర్స్ నార్మల్ గా ఉన్నట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో అల్సర్ తగ్గడానికి అవసరమైన మెడికేషన్ ను ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ ఆరోగ్యం సాధారణంగానే ఉందని తెలిపారు. సీఎంకు సిటీ స్కాన్, ఎండోస్కోపీ నిర్వహించినట్లు తెలిపారు. ఆయన గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడ్డారని చెప్పారు. సంబంధిత వైద్య చికిత్స కేసీఆర్ కు అందిస్తున్నామని తెలిపారు.