తన మెడల్స్ ను ఆ శాఖకు ఇవ్వనున్న రిటైర్డ్ పోలీస్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : పోలీస్ శాఖలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ )గా పనిచేసిన కాలంలో తనకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో వచ్చిన 16 మెడల్స్ ను పోలీస్ శాఖ మ్యూజియంకు అందచేయాలని మహమ్మద్ ఖాసీం నిర్ణయించారు. సెప్టెంబర్, 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందిన మహమ్మద్ ఖాసీం మంచి అథ్లెట్ కూడా. తన సర్వీసులో ఆల్ ఇండియా పోలీస్ మీట్, ఆల్ ఇండియా ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్, ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్, ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ కౌన్సిల్ మీట్ లలో అథ్లెట్ గా పాల్గొన్న ఖాసీంకు 10 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్ వచ్చాయి.
అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మెడల్స్ ను తన వద్ద ఉంచుకోకుండా, యువ పోలీస్ అధికారులకు స్ఫూర్తి నిచ్చేందుకు గాను వాటిని పోలీస్ శాఖకు బహూకరించాలని నిర్ణయించాడు. ఈ మెడల్స్ అన్నింటిని తెలంగాణ పోలీస్ అకాడమిలోని మ్యూజియంలో ప్రదర్శించడానికి (గురువారం) మార్చి 16న టీఎస్ పోలీస్ అకాడమిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో డీజీపీ అంజనీ కుమార్ కు అందచేయనున్నాడు. పలువురు పోలీస్ అధికారులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో మహమ్మద్ ఖాసీంను డీజీపీ అంజనీ కుమార్ సన్మానించనున్నారు.