భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం !

భారీ వర్షాలు.. ఈ జిల్లాలపై అధిక ప్రభావం !

వరంగల్ టైమ్స్, ఏపీ : ఎండలు మండిపోతోన్న వేళ చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. వరుసగా నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ముందుగా ఈ నెల 16 నుంచి వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఇప్పుడు ఒకరోజు ముందుగానే అంటే నేటి నుంచే వర్షాలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. జార్ఖండ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా తెలంగాణ వరకు ఒక ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో నేటి నుంచి నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మరికొన్ని చోట్ల మోస్తారు,అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇక ఏ జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా ఉంటుందనే అంచనాలను కూడా వేసింది వాతావరణశాఖ. మార్చి 17, 18, 19 తేదీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదా­వరి, అంబేడ్కర్‌ కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, గుంటూ­రు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, కడప, తిరుపతి జిల్లాల్లో పలు­చోట్ల వర్షాలు కురుస్తారని పేర్కొంది. ఇదే సమయంలో ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది. ఈ సమయంలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు­గాలు­లు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదై కొత్త రికార్డులు సృష్టించాయి. ఎండలు మండిపోతోన్న వేళ వాతావరణశాఖ చల్లని కబురు చెప్పినప్పటికీ, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.