ఉమా చిట్స్ కేసు స్పీడప్ చేయాలి : ఏపీ హోం మంత్రి
వరంగల్ టైమ్స్, బెజవాడ : బెజవాడలో సంచలనం రేకెత్తించిన ఉమా చిట్స్ వ్యవహారంపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం దృష్టి సారించింది. 2012లో ఉమా చిట్స్ వ్యవహారం విజయవాడ నగరంలో సంచలనం రేపింది. బాధితులకు పరిహారం ఇప్పించే దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది.
ఉమా చిట్ ఫండ్స్ కేసును వేగవంతం చేయాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు సచివాలయంలోని తన ఛాంబర్లో బుధవారం సమీక్ష నిర్వహించారు. హోం మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, నగర కమిషనర్ క్రాంతి రాణా టాటా, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గడ్డం రవి కిషోర్ పాల్గొన్నారు. 2012 నుంచి కేసు పెండింగ్ లో ఉందని, ప్రతీ ఒక్క బాధితుడికి న్యాయం జరిగే విధంగా చొరవ చూపాలని ఈ సందర్భంగా మల్లాది విష్ణు కోరారు.
బాధితులందరినీ ఆదుకుంటామని ఈనెల 17 నుంచి కేసుకు సంబంధించిన విచారణ మొదలవుతుందని మంత్రి తానేటి వనిత తెలియజేశారు. ఖచ్ఛితంగా బాధిత కుటుంబాలకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఉమా చిట్స్ ఆస్తులు అమ్మకానికి పెట్టి బాధిత కుటుంబాలను ఆదుకునే దిశగా చర్యలు వేగవంతం చేయాలని హోం మంత్రి తానేటి వనిత అధికారులకు సూచించారు. ఏప్రిల్ 9న మరోసారి భేటీ కావాలని నిర్ణయించినట్లు మంత్రి తెలియజేశారు.