బాలవికాసపై ఐటీ దాడులను ఖండించిన ఎర్రబెల్లి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : బాలవికాసపై ఐటీ దాడులను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండించారు. హనుమకొండ జిల్లా కేంద్రంలో ఉన్న బాల వికాస ప్రధాన కార్యాలయంలో ఐటీ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు.హనుమకొండ జిల్లా కాజీపేట ఫాతిమాలోని ప్రధాన కార్యాలయంతో పాటు కీసరలో 28 ఎకరాలలో నిర్మించిన భారీ భవన సముదాయాలు, సోమాజిగూడలోని కార్యాలయం, డైరెక్టర్లు, కీలక ఉద్యోగుల నివాసాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు చేపట్టారు.
లౌకిక, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మత రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి దయాకర్ రావు ధ్వజమెత్తారు. గత 25 యేళ్లుగా దేశ, విదేశాల నుంచి నిధులు సమకూరుస్తూ, నిస్వార్థ ప్రజా సేవ చేస్తున్న సంస్థ బాలవికాస అని , అలాంటి సంస్థపై ఐటీ దాడులు బాధాకరమని దయాకర్ రావు పేర్కొన్నారు. బాలవికాస క్రిస్టియన్ మిషనరీ సంస్థ అవడం వల్లే ఈ ఐటీ దాడులు అని అన్నారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఈ ఐటీ దాడులని మంత్రి ఆరోపించారు. ఇలాంటి దాడులతో బాలవికాస లాంటి సంస్థల నిస్వార్థ ప్రజా సేవలను బీజేపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తున్నదని మంత్రి మండిపడ్డారు. భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఆ సంస్థ సేవలను ఆపగలదా అని మంత్రి దయాకర్ రావు బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.