కవితపై బీజేపీ కక్షకట్టింది : కవిత అడ్వకేట్

కవితపై బీజేపీ కక్షకట్టింది : కవిత అడ్వకేట్

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఇది పెండింగ్ లో ఉండటంతో మరోసారి పిటిషన్ కోసం కవిత సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారు. రేపే తమ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని కవిత తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టుని కోరనున్నారు. మార్చి 20న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత తాజా నిర్ణయం తీసుకుంది.అయితే ఎమ్మెల్సీ కవితపై, బీఆర్ఎస్ పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్ష గట్టిందని ఆమె తరపు అడ్వకేట్ సోమా భరత్ మీడియాకు వెల్లడించారు. ఉదయం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ నేపథ్యంలో ఢిల్లీలో హైడ్రామా చోటు చేసుకుందని అన్నారు. ప్రెస్ మీట్ లేదు, విచారణ లేదు, అసలు కేసీఆర్ నివాసం నుంచి కవిత బయటకు వచ్చిందే లేదు. ఆ తర్వాత ఈడీ కోరిన సమాచారాన్ని సీనియర్ న్యాయవాది, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ తో పంపించారు.

తన అనారోగ్య కారణాలతో పాటు సుప్రీం కోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కానీ ఈడీ మాత్రం కవిత వినతిని తోసిపుచ్చినట్లు ఆయన తెలిపారు. ఈడీ విచారణకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో కవిత తదుపరి స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈడీకి కవిత లేఖను అందచేసిన అనంతరం ఆమె లాయర్ సోమా భరత్ మీడియాతో మాట్లాడారు. కవిత తరపున ఈడీకి కొన్ని డాక్యుమెంట్లు ఇచ్చామన్నారు. ఈడీ కోరిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చినట్లు తెలిపారు. కవితపై కేంద్రం కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టిందన్నారు. సీఆర్పీసీ ప్రకారం, మనీలాండరింగ్ యాక్ట్ 50 ప్రకారం, మహిళలను ఇంటి దగ్గరే ప్రశ్నించాలన్నారు. 6 గంటల్లోనే విచారణ జరపాలన్న నిబంధన ఉందన్నారు. అయితే విచారణలో నిబంధనలు ఉల్లంఘించారని విమర్శించారు. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు కవితను ప్రశ్నించారని ఆయన తెలిపారు.

మహిళల హక్కులను కేంద్రం ఉల్లంఘిస్తోందని సోమా భరత్ మండిపడ్డారు. ఇంటి దగ్గర ప్రశ్నించాలన్న కవిత రెక్వెస్ట్ ను ఈడీ తిరస్కరించిందని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరపాలని తెలిపారు. ఈడీ ఎదుట నోటీసు,
డేట్స్ ఇవ్వలేదని సోమా భరత్ వెల్లడించారు.