మోడీతో సీఎం జగన్ చర్చించిన ముఖ్యాంశాలివే
warangaltimes, న్యూఢిల్లీ : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా పార్లమెంట్ లోని కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోడీ, మంత్రి అమిత్ షాలతో సీఎం జగన్ చర్చించారు. ఈ మేరకు వారికి విజ్ఞాపన పత్రం అందించారు సీఎం జగన్.
ప్రధానితో సీఎం ప్రస్తావించిన అంశాలు :
* రాష్ట్ర విభజన జరిగి 9 యేండ్లు కావొస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన చాలా ద్వైపాక్షిక అంశాలు పరిష్కారానికి నోచుకోలేదు. వీటిపై వెంటనే దృష్టిసారించమని ప్రధానిని సీఎం జగన్ కోరినట్లు సమాచారం.
* గతంలో సీఎం జగన్ ప్రస్తావించిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలపై కేంద్రం ఆర్థికశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపి కొంత పురోగతి సాధించిందన్నారు. కీలక అంశాలన్నీ ఇంకా పెండింగులోనే ఉన్నాయన్న విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి వైఎస్ జగన్ తీసుకెళ్లినట్లు సమాచారం.
* 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిసోర్స్ గ్యాప్ ఫండింగ్ కింద రూ.36,625 కోట్ల రూపాయలు పెండింగులో ఉన్నాయి. రీసోర్స్ గ్యాప్ ఫండింగ్ చేస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నిధులను వెంటనే విడుదల చేయాల్సిందిగా, సంబంధిత శాఖలకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా సీఎం కోరినట్లు సమాచారం.
* గతంలో ఉన్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడిందన్న కారణంతో ఇప్పుడు రాష్ట్ర రుణాల పరిమితులపై ఆంక్షలు విధించారు. ఈ ప్రభుత్వం తప్పు లేకపోయినప్పటికీ నిబంధనల ప్రకారం ఇచ్చిన రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణపరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. కోవిడ్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక విపత్తు సమయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ , ప్రధాని మోడీని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం..* పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేదిశగా ప్రాజెక్టు నిర్మాణాన్ని సాగిస్తోంది. ఈ ప్రాజెక్టు విషయలో కేంద్రం ప్రభుత్వం తగిన సహకారం అందిస్తే కొద్దికాలంలోనే ఇది వాస్తవ రూపంలోకి వస్తుంది. ఫలితాలు ప్రజలకు అందుతాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం తాను సొంతంగా సొంత ఖజానానుంచి రూ.2600.74 కోట్ల రూపాయలు ఖర్చుచేసింది. గడచిన రెండు సంవత్సరాలుగా ఇవి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలను వెంటనే చెల్లించాల్సిందిగా తగిన ఆదేశాలు ఇవ్వాలని జగన్ , ప్రధాని మోడీని కోరినట్లు సమాచారం.
* పోలవరం ప్రాజెక్టు అంచనాలను టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్థారించింది. వెంటనే దీనికి ఆమోదం తెలపాల్సిందిగా కోరారు.
* తాగునీటి సరఫరా అంశాన్నికూడా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూడాలని, ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వారీగా నిబంధనలను సడలించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
* పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలని వైఎస్ జగన్, మోడీని కోరారు. ఆలస్యం అవుతున్న కొద్దీ ప్రాజెక్టు వ్యయం పెరిగిపోతుందనే విషయాన్ని మోడీ దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. డీబీటీ పద్ధతిలో ముంపు బాధితులకు ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చని ఆయన తెలిపారు.
* పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10వేల కోట్లు మంజూరుచేయాలని ఏపీ సీఎం , ప్రధానిని కోరినట్లు సమాచారం.
* తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్కోకు రావాల్సిన బకాయిలు అలానే ఉన్నాయి. 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాల్సిందిగా కోరినట్లు సమాచారం.
* జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. దీనివల్ల పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్ ఇస్తోంది. దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలోఆంధ్రప్రదేశ్ చేసిన విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్ కూడా నిర్ణయించిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వినియోగించని రేషన్ కోటాను రాష్ట్రానికి కేటాయించాల్సిందిగా జగన్ కోరినట్లు సమాచారం.
* రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీనివల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తన పరిశ్రమలు రావడమేకాకుండా, సేవారంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడుతుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
* రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేశాం. ప్రతి జిల్లాకు సుమారుగా 18లక్షలమంది జనాభా ఉన్నారు. కొత్తగా కేంద్రం మంజూరుచేసిన మూడు మెడికల్ కాలేజీలతో కలిపి మొత్తంగా 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అనుమతులు మంజూరుచేయాలని కోరినట్లు సమాచారం. ఈ కాలేజీలకు సంబంధించిన పనులు అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయపడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.
* వైయస్సార్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ఏపీ పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. ఈ ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే ఖనిజ కొరత లేకుండా ఏపీ ఎండీసీకి గనులు కేటాయించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.