పెంచికల్‌పేట: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెంచికల్‌పేట మండలం కొండపల్లి గ్రామంలో నిర్మల(15) బాలికపై పెద్దపులి దాడి చేసి ఈ దాడిలో నిర్మల మరణించింది. ఆదివారం ఉదయం తోటి కూలీలతో కలిసి బాలిక గ్రామానికి సమీపంలో ఉన్న చేనులోకి పత్తి ఏరడానికి వెళ్లింది. పత్తి ఏరుతుండగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో పెద్దపులి కనిపించడంతో కూలీలు అందరూ పరుగులు తీశారు. అయితే అక్కడ ఉన్న నిర్మల పరగు అందుకునేలోపే పులి దాడి చేయడంతో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పక్షం రోజుల వ్యవధిలోనే ఇద్దరిపై దాడి చేసి చంపేయడంతో అటవీ గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కాగా.. మహారాష్ర్గ-తెలంగాణ సరిహద్దుల్లో కూడా రెండు రోజుల క్రితం కూడా పెద్దపులి ఒకరిని చంపేసింది.