నాలుగో పెళ్లాంతో, 3వ పెళ్లాం ఇంటికి

నాలుగో పెళ్లాంతో, 3వ పెళ్లాం ఇంటికి

వరంగల్ టైమ్స్, మధ్యప్రదేశ్: తాళి కట్టిన ఒక్క భార్యతోనే వేగలేక మగవాళ్లు ఆపసోపాలు పడుతూ నిట్టూరుస్తూ ఉంటే..ఏకంగా నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడో ప్రబుధ్దుడు. మొదటి భార్య చనిపోగా మిగిలిన ముగ్గురిని మూడు ఊళ్లల్లో పెట్టి భార్యలతో ఎంజాయ్ చేసేవాడు. అయితే కాలం, ఖర్మం కలిసి రాక ఒక చిన్న తప్పుతో జీవితాన్ని చాలించాడు పాపం. మద్యం మత్తులో నాలుగో భార్యను, మూడో భార్య ఇంటికి తీసుకువెళ్లటంతో అతని జీవితమే ముగిసిపోయింది. ఈ దురుదృష్టకర సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే..మధ్యప్రదేశ్ లోని గోటెగావ్ ప్రాంతానికి చెందిన హేమరాజ్ (40)కి నలుగురు భార్యలు. మొదటి భార్య చనిపోగా ముగ్గురు భార్యలను మూడు ఊళ్లల్లో ఉంచి విడతల వారీగా వారి వద్దకు వెళ్లి వస్తూ ఉండేవాడు. రెండో భార్య నర్సింగాపూర్ లోనూ, మూడో భార్య బగాస్ పూర్ లోనూ, నాలుగో భార్య కరేలీ లోను ఉండేది. మద్యం సేవించే అలవాటు ఉన్న హేమరాజ్ గత శనివారం మే 23వ తేదీ రాత్రి మద్యం సేవించి నాలుగో భార్యను తీసుకుని, 3వ భార్య ఇంటికి వెళ్లాడు.

సవతితో తన ఇంటికి వచ్చిన భర్తను చూసిన మూడోభార్య అపర కాళికలా మారి భర్తతో గొడవ పడింది. ఇద్దిరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో హేమరాజ్ మూడో భార్యపై చేయి చేసుకున్నాడు. దీంతో కోపం వచ్చిన ఆమె భర్తను, తన సవతిని ఇంట్లో వదిలేసి అదే గ్రామంలో ఉన్న తన బంధువుల ఇంటకి వెళ్లి పడుకుంది. ఆదివారం ఉదయం ఇంటికొచ్చి చూసే సరికి భర్త హేమరాజ్ ఇంటి పైకప్పుకు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతని నాలుగో భార్య కూడా కనిపించకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.