టీఆర్ఎస్ నుంచి 31 మంది మహిళల విజయం
కర్చీకోసం ఎవరి ప్రయత్నాల్లో వారుహైదరాబాద్: గ్రేటర్ ఎన్నికలు పూర్తవడంతో ఇక అందరి దృష్టి మేయర్ కుర్చీ పై పడింది. ఫలితాల్లో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించడంతో గులాబీ దళం నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందోనని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీఆర్ఎస్ నుంచి మహిళలు పెద్ద సంఖ్యలో విజయం సాధించారు. పైగా అందరు ఉన్నత విద్యాభ్యాసం చదువుకున్న వారు ఉన్నారు. అంతేకాకుండా రాజకీయ నేపథ్యం కలిగిన వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. పలువురు కార్పొరేటర్ల పేర్లు మేయర్ పదవి రేసులో ప్రముఖంగా వినబడుతున్నాయి. అయితే ప్రస్తుత పాలకమండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 వరకు ఉండడంతో మేయర్ స్థానాన్ని ఆశిస్తున్నవారు ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ 56 సీట్లు గెలుచుకోగా 30 మంది ఎక్స్ఆఫీషియోల బలం కూడా ఉంది. వీటితో కలుపుకుని 86 మంది సభ్యుల బలం టీఆర్ఎస్ కు ఉంది. ఇక మజ్లీస్‌కు 54, బీజేపీకి సుమారు 50 మంది సంఖ్య బలం ఉంది. మూడు పార్టీలు మేయర్ పీఠానికి తమ అభ్యర్థులను నిలిపితే టీఆర్ఎస్ ఎవరి మద్దతు లేకుండానే పీఠాన్ని సునాయసంగా కుర్చీని దక్కించుకునే వీలుంది. లేని పక్షంలో మజ్లిస్, బీజేపీలో ఏ పార్టీ గైర్హాజరైనా టీఆర్ఎస్కు లబ్ధి చేకూరుతుంది. అయితే మేయర్ పీఠం జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో టీఆర్ఎస్ నుంచి 31 మంది మహిళలు విజయం సాధించారు. గెలిచిన వారిలో కొందరు రెండోసారి విజయం సాధించిన వారు కూడా ఉన్నారు. దీంతో మేయర్ ను ఎంపిక చేయడం పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశముంది. ఇది ఇలాఉండగా గెలిచిన వారు ఎవరికివారు తమ సానుకూలతలను అధిష్టానం ముందు పదవి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. చూడాలి మరి మేయర్ పదవి ఎవరికి దక్కుతుందో.