వరంగల్ అర్బన్ జిల్లా: రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ కొన్ని రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తెలియజేయడాన్ని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు మారపల్లి రాంచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండుగ చేస్తూ, రైతును రాజు చేసే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నామని చెబుతున్న సీఎం కేసీఆర్ రైతులను సన్న వడ్లు మాత్రమే పండించాలని చెప్పి కొనుగోలు సమయంలో ధర పెంచకపోవడంతో రైతులు నష్టపోయారని మారపల్లి రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. వర్షాలు పడి దిగుబడి రాక రాష్ట్రంలో రైతులు తీవ్రంగా నష్టపోయినా కేసీఆర్ పట్టించుకోలేదని విమర్శించారు. మొక్కజొన్న పండించ వద్దని ముఖ్యమంత్రి చెప్పడం రాష్ట్ర రైతులకు తీరని నష్టమన్నారు. లక్ష రూపాయల పంట రుణ మాఫీ చేస్తానని చెప్పి నేటికి పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రధాని మోదీ దేశంలోని రైతుల కష్టాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా వ్యవసాయ చట్టాలను చేశాడని కొత్త బిల్లులో మార్కెట్ యార్డు బయట అధిక ధరకు అమ్ముకునే అవకాశం కల్పించారని అన్నారు. కనీస మద్దతు ధర నిర్ణయించే వ్యవస్థ కొనసాగుతోందని తెలిపారు. రైతు చట్టాలను వ్యతిరేకిస్తున్నవారు ఏ అంశం రైతులకు వ్యతిరేకంగా ఉందో తెలపాలని కోరారు. హన్మకొండలో నిర్వహించిన ఈ విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు గురుమూర్తి శివకుమార్, జిల్లా కార్యదర్శి గుండమీది శ్రీనివాస్, 56వ డివిజన్ అధ్యక్షులు మేకల హరి శంకర్, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి కుమారస్వామి, మండల అధ్యక్షులు కడిపికొండ సంతోష్ రెడ్డి, బండారి శేఖర్, తాళ్ల రమేష్, దాసరి రాజు, గంట సత్యం, మీసరకొండ సత్యనారాయణ, కందుకూరి సాయిచంద్, పోలెపాక నిషాంత్, వెలిగేటి తిరుపతిరెడ్డి, మోడం వినయ్ కుమార్, దూలం సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.