అమిత్​షాతో ముగిసిన సీఎం జగన్​ భేటీ

అమిత్​షాతో ముగిసిన సీఎం జగన్​ భేటీ

వరంగల్ టైమ్స్, ఢిల్లీ : కేంద్ర హోంశాఖమంత్రి అమిత్​షాతో ఏపీ సీఎం వైఎస్​ జగన్​ భేటీ ముగిసింది. సుమారు గంటకు పైగా వీరిద్దరి మధ్య సమావేశం జరిగింది. ఇటీవల ఏపీలో వరదలు , తుఫాను బీభత్సంతో తీవ్ర నష్టం జరగడంతో వరద సాయం చేయాలని అమిత్​షాను సీఎం జగన్​ కోరారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేలా తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేశారు. రెండవ రివైజ్డ్ కాస్ట్​ ఎస్టిమేట్​(2వ ఆర్​సీఈ ) ప్రకారం 2017-2018 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అయ్యే రూ.55,656 కోట్ల రూపాయల ఖర్చును ఆమోదించాలని సీఎం జగన్​ కోరారు.అలాగే అధికార వికేంద్రీకరణ, ఆంధ్రప్రదేశ్​ సమగ్రాభివృద్ధిలో భాగంగా రాజధాని కార్యకలాపాలను వికేంద్రీకరించేలా ప్రణాళిక వేసుకున్నామని, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసనరాజధానిగా అమరావతి, న్యాయరాజధానిగా కర్నూలుని చేస్తూ ఆగస్టులో చట్టం చేశామని హోంమంత్రి అమిత్​షాకు గుర్తుచేశారు. హైకోర్టును కర్నూలుకు రీలొకేట్​ చేసేలా ప్రక్రియ మొదలుపెట్టాలని, దీనికోసం నోటిఫికేషన్​ ఇవ్వాలని సీఎం కోరారు. 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో కర్నూలులో హైకోర్టు అంశం ఉందని గుర్తుకుతెచ్చారు. గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా సమగ్ర భూ సర్వే కోసం ఉద్దేశించిన ఏపీ ల్యాండ్​ టైటలింగ్​ అథారిటీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం పొందేలా ప్రక్రియను పూర్తిచేయాలని విన్నవించారు. డిసెంబర్​ 21న సమగ్ర సర్వే మొదలుపెట్టనున్న విషయాన్నివివరించారు.మహిళలు, చిన్నారులపై నేరాలను గణనీయంగా తగ్గించడానికి తీసుకొచ్చిన దిశ, ప్రతేక్య కోర్టుల ఏర్పాటు బిల్లుకు త్వరగా ఆమోదం పొందేలా ప్రక్రియ పూర్తిచేయాలంటూ అమిత్​షాను కోరారు. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కొత్తగా 16 వైద్య కాలేజీలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించామని దీనికోసం ఇప్పటికే అభ్యర్థనలు పంపామని తెలిపారు. వెంటనే అనుమతులు వచ్చేలా చూడాలని కోరారు. దీర్ఘకాలంలో రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు చేయడానికి ఈ కళాశాలలు ఎంతో ఉపయోగపడుతాయని కేంద్ర హోంమంత్రికి వివరించారు. ఉపాధి పథకంలో భాగంగా పెండింగ్​లో ఉన్న రూ,3,801.98కోట్లను విడుదల చేయాలని కోరారు.

అలాగే కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్​ తో సీఎం జగన్​ భేటీ అయ్యారు. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ఆమోదంపై చర్చించారు. అనంతరం ఢిల్లీ నుంచి తిరుగుపయనమయ్యారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్​రెడ్డి, అవినాష్​రెడ్డి, వేమిరెడ్డిప్రభాకర్​రెడ్డి, భరత్​ ఉన్నారు.