అమరావతి : ఏపీ ప్రభుత్వం ఇటీవల ఐదు జిల్లాల్లో చేపట్టే రోడ్డు పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించింది. చిత్తూరు, కడప, కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో ఈ పనులు నిర్వహించున్నారు. అయితే ఈ కాంట్రాక్టులపై టీడీపీ ఎంపీ కేశినేని సంచలన ఆరోపణలు చేశారు. కాంట్రాక్టులను జగన్ సర్కార్ కొంతమందికి పంచి పెట్టిందని ట్వీట్ చేశారు. ఎవరెవరికి ఎంత కట్టబెట్టారో అని వివరాలు కూడా ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.‘నిన్న మొత్తం జగన్ మోహన్ రెడ్డి తనవారికి పంచిన రోడ్డు కాంట్రాక్టులు రూ.791.53 కోట్లు . ఆ కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీల వివరాలు పీఎల్ఆర్ (పెద్దిరెడ్డి)రూ.126 కోట్లు ,ఎన్ఎస్పీఆర్ (నర్రెడ్డి పులివెందుల వైఎస్ చుట్టం) రూ.228 కోట్లు , కేసీవీఆర్ (సురేష్ రెడ్డి) రూ.128.36 కోట్లు. నితిన్సాయి (పార్థసారధి వైసీపీ) రూ.121.63 కోట్లు. జేఎంసీ( శ్రీనివాసులు చిత్తూర్ వైసీపీ ఎమ్మెల్యే ) రూ.186.కోట్లు’అని ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో పనులను మంత్రిపెద్దిరెడ్డి, కర్నూలు జిల్లాలో వైఎస్ బంధువులు, కడపలో వైఎస్సార్సీపీ నాయకుడు పార్థసారధి, అనంతపురం జిల్లాలో కేసీఆర్, ప్రకాశం జిల్లాలో చిత్తూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు దక్కించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ కేశినేని నాని ట్వీట్ చేశారు.