తిరుపతి: డిసెంబర్ 25 ఉదయం నుంచి జనవరి 03వ తేదీ రాత్రి 12గంటల వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ జారీ చేయనున్న సర్వ దర్శనం టోకెన్లు ఈ సారి స్థానికులకు మాత్రమే ఇవ్వాలని బోర్డు నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో ఏర్పాటుచేసిన ఐదు కౌంటర్లను ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఎస్పీ రమేష్ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. కౌంటర్ల వద్ద తోపులాట లేకుండా, స్థానికులనే అనుమతించేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.కోవిడ్ నిబంధనల వల్ల రోజుకు 17 నుంచి 18 గంటల్లో 30 నుంచి 50 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశం ఉందన్నారు. కోవిడ్ 19 నిబంధనలు కఠినంగా పాటిస్తున్నందు వల్లనే జూన్ 8 నుంచి ఇప్పటి వరకు ఒక్క భక్తుడికి కూడా కోవిడ్ సోకలేదని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యోగులకు మొదట్లో కరోనా పాజిటివ్ వచ్చినా క్రమంగా అరికట్టగలిగామని తెలిపారు. రోజుకు ర్యాన్డంగా 200 మంది భక్తులకు పరీక్షలు చేస్తుంటే ఒక్కరికి కూడా పాజిటివ్ రాలేదన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కోవిడ్ 19 నిబంధనలు పాటిస్తూనే రోజుకు 30 నుంచి 35 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం చేయిస్తామన్నారు. ఇందులో రోజుకు 20 వేల చొప్పున శీఘ్ర దర్శనం టోకెన్లు ఆన్లైన్ లో విడుదల చేశామని ఆయన తెలిపారు.సర్వ దర్శనం టోకెన్లు అందరికీ అందుబాటులో పెడితే దేశ వ్యాప్తంగా భక్తులు తిరుపతికి వచ్చి కోవిడ్ 19 నిబంధనల ఉల్లంఘన జరుగుతుందన్నారు.దీనివల్ల తిరుపతిలో కోవిడ్ పెరుగుతుందనే భయాందోళనలు కూడా నెలకొన్నాయని ధర్మారెడ్డి చెప్పారు. పెరటాసి మాసం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలు, శాంతి భద్రతల ఇబ్బందుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కారణాల వల్ల సర్వదర్శనం టోకెన్లు స్థానికులకే ఇవ్వాలని నిర్ణయించామని, స్ధానికేతరులు రావద్దని టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి భక్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ ఇంజినీర్ రమేష్ రెడ్డి, ఎస్ ఈ జగదీశ్వరరెడ్డి, విద్యుత్ విభాగం ఎస్ఈ వెంకటేశ్వర్లు, వి జి ఓ మనోహర్ , అదనపు ఆరోగ్యాధికారి డాక్టర్ సునీల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.