నెల్లూరు జిల్లా : పెళ్లయిన కానిస్టేబుల్‌ను ప్రేమించిన ఓ లేడీ ఎస్సై వ్యవహారాన్ని కానిస్టేబుల్ భార్య శనివారం ఎస్పీ దృష్టికి తీసుకెళ్లింది. కానిస్టేబుల్ భార్య ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ దిశ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఆ లేడీ ఎస్సైని వీఆర్‌కు పంపించారు. ఆశ్చర్యమేమిటంటే ఈ వ్యవహారం జరిగిన తర్వాత కూడా వారి ఇద్దరి మధ్య ప్రేమాయణం ఆగలేదు. దీంతో లేడీ ఎస్సై వలలో చిక్కుకున్న భర్తను కాపాడుకునేందుకు సదరు కానిస్టేబుల్ భార్య మరోసారి ఎస్పీని ఆశ్రయించింది. అయితే పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుండడంతో ఆగ్రహించిన ఆ లేడీ ఎస్సై కానిస్టేబుల్ ఇంటికి వెళ్లి అతని భార్యను నిలదీసింది. ఇంతలో బాధితురాలు మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై అక్కడినుంచి చల్లగా జారుకుంది. ఆత్మకూరు డివిజన్ పరిధిలో సదరు లేడీ ఎస్సై, కానిస్టేబుల్ ఒకే పోలీస్ స్టేషన్లో పనిచేసేటప్పుడు ఈ లవ్ స్టోరీ మొదలైనట్టు తెలుస్తోంది. కానిస్టేబుల్ పెంచల సాయిది కలువాయి మండలం బ్రాహ్మణపల్లి. దీంతో ఈ వ్యవహారంపై మొదట కానిస్టేబుల్ భార్య కలువాయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వత ఎస్పీ దగ్గరకు వెళ్లి తనకు న్యాయం చేయాలని కోరింది. కాగా కానిస్టేబుల్ ఇంట్లో లేడీ ఎస్సై కి, కానిస్టేబుల్ భార్యకి మధ్య జరిగిన గొడవ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది.