వరంగల్ అర్బన్ జిల్లా: పట్టణ ప్రగతిలో నిర్దేశిత లక్ష్యాలను శరవేగంగా సాధించాలని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మిస్ట్రేషన్ (సి.డి.ఎం.ఏ) డా.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. హైద్రాబాద్ సి.డి.ఎం.ఏ. కార్యాలయం నుండి ఆయన హరితహారం, పట్టణ ప్రగతిలో అభివృద్ధి, దట్టమైన అడవులు, వైకుంఠధామాలు, నర్సరీల ఏర్పాటు, కపోజిట్ సైట్ లు, ఎఫెస్టిపిలు, సమగ్ర వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ఏర్పాటు, వీధి వ్యాపారులకు రుణాల అందజేత తదితర అంశాల ప్రగతి పై మున్సిపల్ కమీషనర్లు, అధికారులతో దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా లక్ష్యాలను శీఘ్రంగా పూర్తి చేయుటకు దిశా నిర్దేశం చేశారు. హరితహారం లో 2020-22 సంవత్సరానికి లక్ష్యాల ప్రతిపాదనలు వెంటనే రూపొందించాలని ఆదేశించారు. హరితహారాన్ని అత్యంత ప్రాముఖ్యంగా తీసుకొని, నాటిన మొక్కలకు వంద శాతం జియో ట్యాగింగ్ చేయడంతో పాటు 85 శాతం బ్రతికేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పట్టణ ప్రగతిలో ఉత్తమమైన ప్రదర్శన చేసి అవార్డ్ లు సాధించుటకు కృషి చేయాలన్నారు.పట్టణ ప్రగతిలో నిధులను వినియోగించుకుని అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. మునిసిపల్ బడ్జెట్లో గ్రీన్ బడ్జెట్ ను 100 శాతం ఖచ్చితంగా వినియోగించాలని ఆదేశించారు. జంక్షన్ల అభివృద్ధి, ప్లాంటేషన్, నిర్దేశిత నర్సరీలతో పాటుగా, పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠధామాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. స్మృతి వనాల ఏర్పాటు టెండర్ ప్రక్రియ పక్షం రోజుల్లో పూర్తి చేసి రెండు నెలల్లో ఆయా పనులు పూర్తి అయ్యేలా అంకితభావంతో కృషి చేయాలని కోరారు. బడ్జెట్ లో 1/3 నిధులు విలీన గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలన్నారు. లక్ష జనాభా ఉన్న మునిసిపాలిటీలు బయో మైనింగ్ తప్పకుండా నిర్వహణ జరగాలని ఆన్నారు.ఎఫెస్టిపి ఏర్పాటు తక్షణమే స్థలాన్ని సేకరించి పనులు చేపట్టాలని అన్నారు. జంతువుల సంరక్షణ కేంద్రాలు తప్పక ఉండాలని తెలిపారు. సిటిజన్ బడ్డి ఫిర్యాదులను పరిష్కరించాలని అన్నారు.పి.ఎం. స్వనిధిలో వీధి వ్యాపారులకు రుణాల మంజూరులో జాప్యం జరగకుండా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి అర్హులకు రుణాలు త్వరగా మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సందర్భంగా కలెక్టరేట్ విసి హాల్ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో గ్రేటర్ కమిషనర్ పమేలా సత్పతి మాట్లాడారు. పట్టణ ప్రగతిలో రూ 81.54 కోట్లు మంజూరు కాగా 288 అభివృద్ధి పనులకు గాను 100 పనులు పూర్తయి , 42 పురోగతిలో ఉన్నాయని తెలిపారు.146 అభివృద్ధి పనులు టెండర్, అగ్రిమెంట్ దశలో ఉన్నాయని అన్నారు.హరితహారంలో 35 లక్షల లక్ష్యానికి గాను ఇప్పటివరకు బల్దియా పరిధిలో 14 లక్షల 77 వేల మొక్కలను నాటడం జరిగిందని వివరించారు. పట్టణ ప్రకృతి వనంలో 58 ప్రాంతాల్లో ట్రీ పార్క్ లు, 15 ప్రదేశాల్లో దట్టమైన అటవీ మొత్తం 73 ప్రాంతాల్లో పట్టణ ప్రకృతి వనాల ఏర్పాటు లక్ష్యం కాగా 47 ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని అన్నారు. 8 వైకుంఠ దామాల నిర్మాణం పురోగతిలో ఉన్నాయని చెప్పారు.17 నర్సరీల ఏర్పాటు లక్ష్యం కాగా 4 ఉపస్థితిలో ఉన్నాయని, 13 నర్సరీలు వివిధ పురోగతి దశల్లో ఉన్నాయని ఆన్నారు. రాంపూర్ లో ఎఫెస్టిపి ఏర్పాటుకు త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. పి.ఎం. స్వనిధిలో వీధి వ్యాపారులకు 10 వేల రుణాలు అందించుటకు గ్రేటర్ పరిధిలో 36611 అర్హులను గుర్తించి సంబంధిత బ్యాంక్ లకు పంపగా 27386 మందికి రుణాలు అందాయని, మిగతా 9225 మందికి త్వరగా అందేలా చర్యలు తీసుకుంటున్నామని పమేలా సత్పతి తెలిపారు. అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకొంటున్నామని ఆమె వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డీఎంఏ షాహిద్ మసూద్, ఉప కమిషనర్ గోధుమల రాజు,సెక్రెటరీ విజయలక్ష్మి, సీహెచ్ ఓ సునీతా, ఎస్ ఈ విద్యాసాగర్, సిపి నర్సింహ రాములు, హెచ్ ఓ ప్రెసిల్లా, బల్దియా, మెప్మా ప్రాజెక్ట్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.