కడప జిల్లా : తెలుగు సినీ పరిశ్రమలో వరుస విషాదాలు అభిమానులని శోకసంద్రంలోకి నెడుతున్నాయి. ఇటీవల కరోనాతో శివశంకర్ మాస్టర్ కన్నుమూయగా, కొద్ది రోజులకే లెజండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్తమించారు. వీరికి ముందు కూడా తక్కువ సమయంలో పలువురు ప్రముఖులని ఇండస్ట్రీ కోల్పోయింది.
ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎస్ఆర్ కల్యాణ మండపం చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన రామాంజులు రెడ్డి కన్నుమూశాడు. అబ్బవరం రామాంజులు రెడ్డి సంబేపల్లె మండలం దుద్యాల గ్రామంలో నివసిస్తున్నాడు.
యువ నటుడు కిరణ్ అబ్బవరం విషయానికి వస్తే సినిమాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నాడు. వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ‘రాజావారు రాణిగారు’, ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ చిత్రాలతో మెప్పించిన ఈయన ప్రస్తుతం ‘సమ్మతమే’, ‘సెబాస్టియన్ పీసీ 524’ సినిమాలతో బిజీగా ఉన్నాడు.