ఏపీ సర్కార్ కి హైకోర్టులో ఎదురుదెబ్బ

అమరావతి : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్కూళ్లు, కాలేజీల్లో ఫీజులపై గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఉత్వర్వులను న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు ఫీజులు ఖరారు చేస్తూ ఆగస్టు 24న ప్రభుత్వం 53, 54 జీవోలను చేసిన విషయం విదితమే.

ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ మేరకు పిటిషన్ ను సోమవారం విచారించిన కోర్టు, మేనేజ్మెంట్ నుంచి ప్రతిపాదనలు తీసుకొని కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

అయితే ఈ జీవోలను సవాల్ చేస్తూ తూర్పు గోదావరి ప్రైవేట్ స్కూళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, మరికొన్ని విద్యాసంస్థల తరపున గతంలో వ్యాజ్యాలు దాఖలు చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ హైకోర్టుకు విన్నవించాయి. ఈ మేరకు హైకోర్టు రెండు జీవోలను కొట్టి వేసింది.