న్యూఢిల్లీ : జనవరి 13న సాయంత్రం 5గంటలకు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై సీఎంలతో మోడీ సమీక్షించనున్నారు.
దేశంలో పలు రాష్ట్రాల్లో వైరస్ కట్టడికి విధించిన ఆంక్షలపై చర్చించనున్నారు. రాష్ట్రాల్లో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్ తీరుపై సమాలోచనలు జరుపనున్నారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో కట్టడి చర్యలను సూచించనున్నారు.
ఆదివారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో కొవిడ్ పరిస్థితలుపై చర్చించిన ప్రధాని వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించారు. కరోనాను అడ్డుకునేందుకు వ్యాక్సిన్ వేసుకోవడమే ఉత్తమమని మోడీ పేర్కొన్నారు. దేశంలో ప్రతీ రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈక్రమంలోనే తాజాగా భారత్ వ్యాప్తంగా 1,68,063 కరోనా కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.