హైదరాబాద్ : స్వాతంత్ర్య సమరయోధులు, పద్మ శ్రీ టీవీ నారాయణకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నివాళులు అర్పించారు. మాసబ్ ట్యాంక్ లో టీవీ నారాయణ పార్థివ దేహానికి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, అణగారిన వర్గాలకు విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేసిన ఉద్యమకారుడిగా టీవీ నారాయణ ఎన్నో సేవలందించారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
అంతకాదు ప్రజాజీవితంలో ఉన్న అనేక మంది నవతరం నాయకులకు టీవీ నారాయణ మార్గదర్శిగా నిలిచారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు. అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకై దీక్ష చేసేందుకు అందరినీ ఏకతాటిపై తెచ్చి టీవీ నారాయణ ప్రోత్సాహించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి టీవీ నారాయణ, వారి జీవిత భాగస్వామి సదాలక్ష్మి చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఆమె తెలిపారు. టీవీ నారాయణ లేని లోటును భర్తీ చేయలేమన్నఎమ్మెల్సీ కవిత, వారి ఆశయాలను కొనసాగించాలని సూచించారు. చిత్తశుద్దితో పనిచేయడమే వారికి నిజమైన నివాళి అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.