సంగారెడ్డి జిల్లా : తెలంగాణలో ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం భారతీ నగర్ డివిజన్ పరిధిలోని ఇక్రిశాట్ ఫెన్సింగ్ ఏరియాలో జరుగుతున్న ఫీవర్ సర్వేను మంత్రి పరిశీలించారు. గత రెండు రోజుల్లో 29 లక్షల 20వేల ఇండ్లల్లో ఫీవర్ సర్వే జరిగిందన్నారు. లక్షమందికి హోం ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేశామన్నారు. ముందస్తుగా ఫీవర్ సర్వే చేసి మెడికల్ కిట్స్ పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఫీవర్ సర్వేకు ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు.
కొవిడ్ నియంత్రణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి పేర్కొన్నారు. మరో 4, 5 రోజుల్లో ఫీవర్ సర్వే 100 శాతం పూర్తవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల కొవిడ్ బెడ్స్ అందుబాటులో ఉంచినట్లు మంత్రి తెలిపారు. కరోనా బారిన పడిన గర్భిణులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. గర్భిణులు కరోనా చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.