నిత్యం అప్రమత్తంగా సేవలందించండి : టీటీడీ ఈవో
వరంగల్ టైమ్స్, తిరుమల : తిరుమలతో పాటు స్థానిక ఆలయాలకు కూడా భక్తుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం అప్రమత్తంగా ఉంటూ భక్తులకు సేవలందించాలని టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టీటీడీ ఆలయాల్లో భక్తుల రద్దీ నిర్వహణ, వారికి కల్పిస్తున్న సౌకర్యాలపై సోమవారం రాత్రి ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి , అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. వేసవి ముగిసే వరకు ఆలయాలకు భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. తిరుమలలో టోకెన్ లేకుండా సర్వదర్శనం అమలు చేస్తున్నందువల్ల క్యూ లైన్లు, షెడ్లు, క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు తాగునీరు, ఆహారం, పాలు నిత్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కళ్యాణకట్ట, సీఆర్వో, పీఏసీల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. విభాగాది పతులు క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరపాలని అన్నారు.
స్థానిక ఆలయాల్లో సైతం భక్తులు ఎక్కువ సమయం దర్శనం కోసం వేచి చూసే పరిస్థితి రాకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఈవో సూచించారు. అన్ని ఆలయాల్లో తాగునీరు, నీడ ఉండాలని ఈవో చెప్పారు. కోవిడ్ కు ముందు ఎక్కడ ఎంత మంది ఉద్యోగులు పని చేసే వారో తెలుసుకుని, అవసరమైన చోట వెంటనే ఉద్యోగులను రప్పించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. భద్రతా విభాగం కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు. అదనపు ఈవో ధర్మారెడ్డి, జేఈవో వీర బ్రహ్మం, సివి ఎస్వో నరసింహ కిషోర్, ఎఫ్ ఏసిఏఓ బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, విజిఓ మనోహర్ తో పాటు ఆయా విభాగాల డిప్యూటీ ఈవోలు పాల్గొన్నారు.