బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(77) అభిమానులకు శుభవార్త. బిగ్ బీ కరోనా మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకున్నారు. అమితాబ్‌కు కొవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చినట్లు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. కొవిడ్ నెగిటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి నాన్న డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. బిగ్ బీ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. జులై 11వ తేదీన అమితాబ్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరారు. 23 రోజుల పాటు ఆయన కరోనా చికిత్స తీసుకున్నారు. అమితాబ్‌కు కరోనా నెగిటివ్ ఫలితం వచ్చిందని జులై 23న సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేసిన సంగతి తెలిసిందే. ఆ పుకార్లపై అమితాబ్ స్పందించారు. తనకు నెగిటివ్ ఫలితం రాలేదని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నానని స్పష్టత ఇచ్చారు.
నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తన అనుభవాలని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఒంటరిగా ఉండడం వలన మానసిక స్థితిపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దాని గురించి తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు బిగ్ బీ.