కంటి వెలుగుకు పకడ్బందీ ఏర్పాట్లు
వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : ఈ నెల 19 నుండి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి జీడబ్ల్యూఎంసీ వ్యాప్తంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రధాన కార్యాలయం లోని మేయర్ ఛాంబర్ లో బల్దియా కంటి వెలుగు కార్యక్రమ ఏర్పాట్లపై సంబంధిత ఉన్నతాధికారులతో ఆమె సమీక్షించారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్ లలోని 101 ప్రాంతాల్లో శిబిరాలు 37 మెడికల్ టీంల ద్వారా 100 రోజులపాటు నిర్వహించుటకు పటిష్ట కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం జరిగిందని మేయర్ అన్నారు. దానికనుగుణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక కార్పొరేటర్ల సమన్వయంతో ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని మేయర్ గుండు సుధారాణి సూచించారు. కంటి వెలుగు కేంద్రాల వద్ద శిబిరాల నిర్వహణకు అవసరమగు అన్ని ఏర్పాట్లు వెంటనే పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ప్రతీ శిబిరానికి జీడబ్ల్యూఎంసీ మరియు వైద్య ఆరోగ్య శాఖ నుండి నోడల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా శిబిరాలు పరిశుభ్రం గా ఉండేలా చూడాలని, షామియానా,టెంట్లు,మంచి నీటి సౌకర్యం వంటి ఏర్పాటు ఉండాలని తెలిపారు. జీడబ్ల్యూఎంసీ, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్ల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఈ.కృష్ణ రావు, సీఎంహెచ్ఓ డా.జ్ఞానేశ్వర్, సెక్రెటరీ విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ జోనా, ఎం.హెచ్. ఓ.డా.రాజేష్, ఈఈలు బీఎల్. శ్రీనివాస రావు, సంజయ్ కుమార్, శ్రీనివాస్ తో పాటు డీఈలు, శానిటరీ సూపర్ వైజర్ లు తదితరులు పాల్గొన్నారు.