ఐపీఎల్ క్రికెట్ పోటీలకు ఆంధ్రా యువకుడు

వరంగల్ టైమ్స్, అమరావతి : ఐపీఎల్ క్రికెట్ పోటీలకు ఆంధ్రా యువకుడు ఎంపికయ్యాడు. నిన్న బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో నెల్లూరు జిల్లాకు చెందిన అశ్విన్ హెబ్బార్ ను రూ.20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్ దక్కించుకుంది. ఇప్పటికే వివిధ చోట్ల జరిగిన క్రికెట్ పోటీల్లో బ్యాట్స్ మెన్ గా రాణిస్తున్న అశ్విన్ ను ఐపీఎల్ ద్వారా తన సత్తాను మరింత చాటనున్నాడు. ఐపీఎల్ వేలానికి ప్రపంచ వ్యాప్తంగా 1300 మందితో కూడిన జాబితాను సిద్ధం చేశారు. వారిలో 599 పేర్లను సెలెక్ట్ చేసిన సెలెక్టర్లు జాబితాలో బ్యాట్స్ మెన్ అశ్విన్ హెబ్బార్ 57వ స్థానంలో ఉండటం గమనార్హం.

మార్చి 26 నుంచి జరుగనున్న ఐపీఎల్ పోటీలకు ఎంపిక కావడం పట్ల అశ్విన్, అతని తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యంగా మంచి ప్రతిభతో సత్తా చాటి సెలెక్టర్ల దృష్టిలో పడుతానని అశ్విన్ పేర్కొన్నాడు. తమ కుమారుడికి ఐపీఎల్ లో చోటు దక్కించుకోవడం ఆనందంగా ఉందని అశ్విన్ తల్లిదండ్రులు రాజ్ గిరి, నళిని తెలిపారు. ఐపీఎల్ లో అనుకున్న లక్ష్యాలను సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. 2021-2022లో సయ్యద్ ముస్తాఖ్ అలీ ట్రోఫీలో 5 మ్యాచ్ లు ఆడి 279 రన్స్ సాధించాడు. అతని కెరీర్ లో 41 టీ20 మ్యాచ్ లు ఆడి 1117, ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు 22 ఆడి 680 పరుగులు సాధించాడు.