వరంగల్ అర్బన్: ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ శాకంబరీ అలంకరణలో శ్రీ భద్రకాళి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత 15రోజులుగా ఉదయం, సాయంత్రం వివిధ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున సంపూర్ణ శాకంబరీగా భక్తులకు దర్శనమిచ్చింది. ఉదయం నిత్య పూజలు, నిత్యారాధనతో పాటు
200 కిలోల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారిని సంపూర్ణ శాకంబరీగా అలంకరించారు.
కరోనా వైరస్ ప్రభావంతో ఆలయ అర్చకులు, నిర్వహణాధికారులు కోవిడ్ నిబంధనలు పాటించిన భక్తులనే ఆలయంలోకి అనుమతించారు. ఆలయం ఎంట్రెన్స్ లో థర్మల్ స్క్రీన్ చేసిన తర్వాతనే భక్తులకు ఆలయంలోపలికి అనుమతించారు. గత 14రోజులుగా ఆలయానికి భక్తుల తాకిడి కొంత తగ్గినప్పటికీ, చివరి రోజు శాకంబరీ ఉత్సవం కావడంతో ఉదయం నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే అమ్మవారిని దర్శించుకున్నారు. సంపూర్ణ శాకంబరీ అలంకరణలో వున్న భద్రకాళి అమ్మవారిని చూసి కొందరు భక్తులు తన్మయత్వంతో ఊగిపోయారు. భద్రకాళీ శరణు శరణు అంటూ అమ్మవారిని మనసారా వేడుకున్నారు.