బిగ్ బాస్ షో 5వ సీజన్ కి ముహూర్తం ఫిక్స్

హైదరాబాద్ : బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌కు ముహుర్తం ఫిక్స్‌ అయ్యింది. సెప్టెంబర్‌ 5 నుంచి స్టార్‌ మాలో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రసారం కానుంది. ఈ విషయాన్ని షో నిర్వాహకులు అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమో విడుదల చేశారు. సెప్టెంబర్‌ 5న సాయంత్రం 6 గంటలకు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తర్వాత ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు, శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు షో ప్రసారం కానుంది. త్వరలోనే ఈ షోలో పాల్గొనబోయే సభ్యుల వివరాలు తెలియజేయనున్నారు.

అయితే ఎప్పటి మాదిరే ఈ సారి కూడా బిగ్‌బాస్‌ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ సోషల్‌ మీడియాలో ఓ లిస్ట్‌ చక్కర్లు కొడుతోంది. అందులో యాంకర్ రవి, నటి ప్రియా, ట్రాన్స్‏జెండర్ ప్రియాంక, యాంకర్ వర్షిణి, యానీ మాస్టర్, కార్తీక దీపం భాగ్య అలియాస్ ఉమ, నటి లహరి, నవ్య స్వామి, యూట్యూబర్ నిఖిల్, వీజే సన్నీ, ఆర్జే కాజల్, లోబో, సిరి హన్మంత్, ఆట సందీప్ భార్య జ్యోతి, యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్, శ్వేతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో కొందరి పేర్లు దాదాపు ఖాయమే అని తెలుస్తుంది. ఇక ఈసారి కూడా హోస్ట్‌గా కింగ్‌ నాగార్జుననే వ్యవహరించనున్నాడు.