ఉక్రెయిన్ కు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ సంఘీభావం
వరంగల్ టైమ్స్, వాషింగ్టన్ : ఇద్దరు అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ లు, ఉక్రెయిన్ కు మద్దతుగా నివాళి అర్పించారు. చికాగోలోని ఉక్రెయిన్ చర్చికి వెళ్లిన ఆ ఇద్దరూ పుష్ప గుచ్ఛాలతో నివాళి ప్రకటించారు. ఉక్రెయిన్ జాతీయ జెండాలోని బ్లూ, ఎల్లో రిబ్బన్లు ధరించిన ఆ ఇద్దరూ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. చికాగోలోని సెయింట్ వొలోడిమిర్, ఓలా క్యాథలిక్ చర్చి వద్ద ఇద్దరూ బొకేలను పెట్టారు. ఉక్రెయిన్ ప్రజలకు అండగా అమెరికా ఉందని ఆ ఇద్దరు మాజీ అధ్యక్షులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గడిచిన నెలలో ఉక్రెయిన్ పై రష్యా దాడి మొదలు పెట్టిన విషయం తెలిసిందే. పుష్పాలతో నివాళి అర్పించిన వీడియోను బిల్ క్లింటన్ తన ట్విట్టర్ లో పోస్టు చేశారు. అణచివేతకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉక్రెయిన్ కు సంఘీభావం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. డెమోక్రటిక్ నేత బిల్ క్లింటన్, రిపబ్లికన్ నేత జార్జ్ బుష్ లు అమెరికా 42వ, 43వ దేశాధ్యక్షులుగా చేశారు. 45వ దేశాధ్యక్షుడిగా ట్రంప్ పని చేశారు. అయితే పుతిన్ వ్యూహాన్ని ట్రంప్ సమర్థించిన విషయం తెలిసిందే.