కేంద్రమంత్రి, గవర్నర్ విషెష్ టూ సింగరేణి

హైదరాబాద్ : సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ సింగరేణి సంస్థకు, కార్మికులకు తమ శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ బండారు దత్తాత్రేయ పత్రికా ప్రకటన ద్వారా నల్ల బంగారం అందిస్తున్న సింగరేణి చీకటి సూర్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పారిశ్రామిక ప్రగతికి పురోగతికి వెన్నెముకగా, దక్షిణ భారతవనికి వెలుగు దివ్వెగా వున్న సింగరేణి మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. కాగా, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తన ట్విట్టర్ సందేశంలో సింగరేణి సంస్థ దేశ విద్యుత్తు అవసరాలు తీర్చడంలో గొప్పగా కృషి చేస్తోందని , రాబోయే కాలంలో కూడా పర్యావరణహిత పద్ధతుల్లో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలని తెలుపుతూ తన శుభాకాంక్షలు తెలియచేశారు.