హైదరాబాద్ : భారత రాజ్యాంగంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పొరపాట్లు చేశాయని కేసీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్ లో మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్ కేంద్రంలో బీజేపీ తీరుపై మండిపడ్డారు. వచ్చే నెలలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల మాట ఎలా ఉన్నప్పటికీ బీజేపీ బలం తగ్గుతదని , బీజేపీ తలపొగరు తగ్గుతదని కేసీఆర్ తెలిపారు. 5 రాష్ట్రాల్లో పంజాబ్, ఉత్తరప్రదేశ్ అతిపెద్ద రాష్ట్రాలు. పంజాబ్ లో బీజేపీ సున్నా, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ బలం తగ్గుతదని సీఎం అన్నారు. మిగతా రాష్ట్రాలు చాలా చిన్నవని, వాటి ఎన్నికల ఫలితాలతో పెద్దగా ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారులు, హక్కులపై కేంద్ర, రాష్ట్ర జాబితాలు, ఉమ్మడి జాబితాలు ఉన్నాయని, కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లేవన్నారు. సమాఖ్య స్ఫూర్తికి నిదర్శనంగా లేవన్నారు. కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని అన్నడని కొన్ని కుక్కలు మొరుగుతయి, కొందరు నేతలు మాట్లాడతారన్నారు. దీనిపై చర్చ జరుగుతది కదా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఏమిటో, బీజేపీ ఏమిటో దేశ ప్రజలు చూశారని సీఎం కేసీఆర్ అన్నారు. భారత్ తెలివైన దేశం మౌనంగా ఉండదు.. స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ఆల్టర్నేటివ్ శక్తి వస్తే ఫలితాలు ఎలా ఉంటాయన్నది అర్థం అవుతుందన్నారు సీఎం కేసీఆర్.