ధోనీ కెప్టెన్సీ లో చెన్నై సూపర్ కింగ్స్ గ్రాండ్ విక్టరీ
వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చివరి వరకు పోరాడి ఓడింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ టీంకు చెన్నై ఓపెనర్లు చుక్కలు చూపించారు. రుతురాజ్ గైక్వాడ్ (99), డెవాన్ కాన్వే ( 85 నాటౌట్ ) అదరగొట్టే బ్యాటింగ్ తో ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసి సన్ రైజర్స్ కు భారీ లక్ష్యాన్ని ముందుంచింది. లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ (39), కేన్ విలియమ్సన్ (47) సన్ రైజర్స్ కు శుభారంభం అందించారు.
అయితే వీరి బ్యాటింగ్ చూసిన అభిమానులకు ఒక దశలో సన్ రైజర్స్ లక్ష్యాన్ని ఛేదించేలా కనిపించింది. ఆటపై పట్టు సాధించే క్రమంలో చెన్నై పేసర్ ముకేష్ చౌదరి తన బంతులతో ఆ జట్టు గెలుపుకు అడ్డుకట్ట వేశాడు.దీంతో రాహుల్ త్రిపాఠీ (0), వాషింగ్టన్ సుందర్ (2), శశాంక్ సింగ్ (15) భారీ షాట్లు ఆడలేక పెవిలియన్ దారి పట్టారు. ఎయిడెడ్ మార్క్రమ్ (17), నికోలస్ పూరన్ (64 నాటౌట్ ) పోరాడినా 14 పరుగుల తేడాతో చెన్నై చేతిలో సన్ రైజర్స్ కి ఓటమి పాలైంది.
నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి 6 వికెట్ల నష్టానికి 189 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఈ మ్యాచ్ లో ట్విస్ట్ ఏంటంటే చెన్నై పగ్గాలు మళ్లీ అందుకున్న ధోనీ అభిమానులకు మరోసారి తన మార్కు విజయాన్ని రుచి చూపించినట్లైంది.