వరంగల్ టైమ్స్, ఖమ్మం జిల్లా : ఫిబ్రవరి 27నుంచి కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోరుతూ మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క పాదయాత్ర నిర్వహించనున్నారు. ముదిగొండ మండలం యడవల్లి గ్రామం నుంచి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభం కానుంది. సుమారు 500 కి.మీ. పైగా నిరంతరం సాగే ఈ పాదయాత్ర ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు, క్షేత్రస్థాయిలో అమలు తీరును ప్రత్యక్షంగా తెలుసుకోనున్నారు. గ్రామాల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం తీరు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు గిట్టుబాటు ధరలు, అర్హులకు పింఛన్లు ఇలా టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు తీరును ప్రజలనుంచే అడిగి తెలుసుకుని వారి సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు.
నియోజకవర్గవ్యాప్తంగా మార్చి 30 వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఫిబ్రవరి 27న ఉదయం 9 గంటలకు ముదిగొండ మండలం యడవల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్ర ప్రారంభానికి సంబంధించి షెడ్యూల్ ను విడుదల చేశారు. ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాల్లో భట్టి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజల అనంతరం పాదయాత్రను ముగించనున్నారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలు అందించాలని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.