ఎన్నికల వేళ సీఎం జగన్ కొత్త పథకాలు
– మహిళలకు వరాలు..రైతు రుణమాఫీ..!?
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారం నిలబెట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావిస్తున్నారు. పొత్తులతో జగన్ ఓటమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్న వేళ, జగన్ సంక్షేమమే అస్త్రంగా బరిలోకి దిగుతున్నారు. మరిన్ని పథకాల ప్రకటన పైన కసరత్తు జరుగుతోందని సమాచారం. రైతులు, మహిళలే లక్ష్యంగా సంక్రాంతి వేళ కీలక ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది.
జగన్ కొత్త అస్త్రాలు : సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి వచ్చినా తాను సింగిల్ గానే పోటీ చేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో తాను అమలు చేసిన సంక్షేమమే తనను గెపిస్తుందని విశ్వసిస్తున్నారు. అటు ప్రతిపక్షాలు పొత్తులతో జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ వారి పపైన ఎన్నికల అస్త్రాలను సిద్దం చేస్తున్నారు. పులివెందుల పర్యటనలో భాగంగా పార్టీ నేతలతో జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. భవిష్యత్ లో సరి కొత్త పథకాలు తీసుకొస్తున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించారు. వివక్ష లేని సుపరిపాలన తన లక్ష్యమని స్పష్టం చేసారు. నమ్మకం రెట్టింపు అయ్యేలా పని చేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.
రైతు రుణ మాఫీ : సామాజిక – ప్రాంతీయ సమీకరణాలను పక్కాగా అమలు చేస్తున్న సీఎం జగన్ మరో కొత్త వరం ప్రకటనకు సిద్దం అవుతున్నట్లు అధికార పార్టీలో ప్రచారం సాగుతోంది. ఎన్నికల ముందే రైతు రుణమాఫీ ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. రైతులను మరింత దగ్గర చేసుకోవటంతో పాటుగా.. ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రైతులకు సంబంధించి రుణమాఫీ పైన ఆలోచన జరుగుతోందని పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతోంది. దీనిని అమలు చేయటం లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. 2014 లో చంద్రబాబు,పవన్ కల్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లో షరుతులు పెట్టి..పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని, చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.