హైదరాబాద్ : సీఎం కేసీఆర్ జిల్లాల కలెక్టర్లతో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో దళితబంధుతో పాటు పథకాల అమలు, వ్యవసాయం, ధాన్యం సేకరణ, కొవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, పోడ్ భూముల సమస్యపై విస్తృతంగా చర్చించనున్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేయనున్నారు. కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తారు.
పల్లె ప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు, మెడికల్ కాలేజీలు, ధరణి సమస్యల వంటి అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నాయి. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై సమావేశంలో నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది.