డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే ఇక అంతే..
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే సదరు వాహనం సీజ్ చేయబడుతుందని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ వాహనదారులను హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు క్రమశిక్షణతో కూడిన ట్రాఫిక్ ను కొనసాగించేందుకు పోలీస్ కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఈ నెల 17 తర్వాత ఇక వాహనదారులు తమ వాహనాలు నడిపేందుకుగాను అవసరమయిన డ్రైవింగ్ లైసెన్స్ తప్పక కలిగి వుండాలన్నారు. వాహనదారులు ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపితే వారి వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తామన్నారు. దీంతో పాటు వాహన యజమానిపై మోటార్ వెహికిల్ యాక్ట్ 180 మరియు 181 సెక్షన్లు అనుసరించి కోర్టులో చార్జ్ షీట్ సమర్పించడం జరుగుతుందన్నారు.లైసెన్స్ లేని వాహనదారుడు నూతనంగా రవాణా శాఖ నుండి పొందిన లర్నింగ్ లైసెన్స్ పత్రాలను పోలీస్ అధికారులకు సమర్పించాలన్నారు. ఆ తర్వాతనే సీజ్ చేసిన మీ వాహనాన్ని తిరిగి అందజేయడం జరుగుతుందని సీపీ సూచించారు. అలాగే మైనర్లు వాహనాలు నడిపితే వారి వాహనాలు కూడా సీజ్ చేసి, తల్లిదండ్రులకు లేదా వాహన యజమానికిపైన కోర్టులో చార్జ్ షీట్ సమర్పించడం జరుగుతుందన్నారు. దీంతో పాటు మైనర్లపై కూడా జువైనల్ కొర్టులో చార్జ్ షీట్ సమర్పించబడుతుందని హెచ్చరించారు. అలాగే మైనర్ల తల్లిదండ్రులకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పోలీస్ అధికారులచే కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని వరంగల్ సీపీ ఏవి రంగనాథ్ వాహనదారులకు సూచించారు. కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం తమ వంతు సహకారాన్ని అందించారలని ఏవి రంగనాథ్ వాహనదారులను కోరారు.