జయశంకర్ భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ లో విషాదం చోటుచేసుకుంది. డబ్బులు, బంగారం ఇవ్వాలంటూ తల్లిని చితకబాది, గొంతు నులిమి చంపే ప్రయత్నం చేసిన ఓ కర్కష కుమారుడి కృూరమైన పని వెలుగులోకి వచ్చింది. గణపురం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన బొట్ల సమ్మక్కకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు బొట్ల స్వామి వరంగల్ లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇక తల్లి సమ్మక్క గణపురం మండల కేంద్రంలోని ఓ రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తోంది. అయితే ఇదే క్రమంలో తల్లి సమ్మక్క దగ్గర డబ్బుల కోసం కుమారుడు స్వామి తరుచూ ఇబ్బందులకు గురిచేస్తుండటంతో పాటు అనేక మార్లు తల్లిపై చేయిచేసుకున్న సందర్భాలు వున్నాయని మిల్లులో సమ్మక్క తోటి కార్మికుల సమాచారం. అయితే కొడుకు బెదిరింపులతో అడిగినప్పుడల్లా తోచిన సాయం చేసిన తల్లిని అదే అదనుగా భావించిన కర్కష కొడుకు ఆమెను ఏకంగా చంపాలనుకున్నాడు. తల్లిని డబ్బులు డిమాండ్ చేస్తూనే, ఆమె ఆంటిపై వున్న బంగారు ఆభరణాలు ఇవ్వాలంటూ స్వామి ఇబ్బంది పెడుతున్నాడు. అయితే అడిగినప్పుడు డబ్బులు ఇచ్చే తల్లి ఇప్పుడు కాదు, లేదు అంటూ కొడుకుని బుజ్జగించడంతో కన్న తల్లి అని కూడా చూడకండా కర్కషంగా మారాడు. తల్లి చనిపోతేనే తన బంగారం, డబ్బులు తన చేతుల్లో పడతాయనుకున్నాడు. అంతే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారు జామున ఇంట్లో వున్న 12వేల నగదును చోరీ చేసి, తల్లి మెడలో వున్న బంగారు గొలుసును తీసుకునే ప్రయత్నం చేశాడు. అనంతరం తల్లి సమ్మక్కపై దాడి చేసి గొంతు నులిమి చంపేందుకు యత్నించాడు. ఈ తంతు గమనించిన చుట్టుపక్కల వాళ్లు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడంతో కొడుకు స్వామి పరారీ అయ్యాడు. సమ్మక్క పరిస్థితి విషమించడంతో 108లో ములుగు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.