హనుమకొండ జిల్లా : స్వరాష్ట్ర సాధనకై ఆనాటి ఉద్యమ నేత, నేటి సీఎం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజు 2009,నవంబర్ 29. నాడు తెలంగాణ వచ్చుడో, తాను చచ్చుడో అన్న నినాదంతో నాడు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ గతిని మార్చి యావత్ తెలంగాణ ప్రజలను ఏకం చేసింది. ఢిల్లీ పునాదులను కదిలించి స్వరాష్ట్రాన్ని సాధించేకునేలా చేసింది. స్వరాష్ట్ర సాధనకు బీజం పడిన 2009, నవంబర్ 29 దీక్షా దివాస్ నేటితో 12 యేండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ శ్రేణులు, తెలంగాణ ఉద్యమకారులు దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించారు.
ఇందులో భాగంగానే అదాలత్ సర్కిల్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఆధ్వర్యంలో దీక్షా దివస్ కార్యక్రమం చేపట్టారు. ఈ దీక్షా దివస్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. ముందుగా ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అమరవీరుల స్థూపానికి పూల మాల వేశారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ, తెలంగాణ అమరులకు ఘన నివాళులర్పించారు.
తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన దాస్యం వినయ్ భాస్కర్ దీక్షా దివస్ లో పాల్గొని నాటి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేశారు. ఉద్యమ నేత , సీఎం కేసీఆర్ ప్రాణాలను సైతం పనంగా పెట్టి తెలంగాణ సాధించుకున్న తీరును ప్రజలకు తెలిసేలా దీక్షా దివస్ కార్యక్రమాలు ఉంటాయని చీఫ్ విప్ పేర్కొన్నారు. స్వరాష్ట్ర సాధనతో తెలంగాణ ప్రజలు సంక్షేమ పథకాలను అందుకుంటున్నారని అన్నారు.సీఎం కేసీఆర్ పాలనాతీరు, అభివృద్ధి, ప్రజల మెప్పును ఓర్వలేకనే కొన్ని రాజకీయ పార్టీలు తమను విమర్శిస్తున్నాయని ఎద్దేవా చేశారు. అదాలత్ సర్కిల్ లో చేపట్టిన దీక్షా దివస్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు మేయర్ గుండు సుధారాణి, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ ఖాన్, తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాస్యం విజయ్ భాస్కర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లు, తెలంగాణ ఉద్యమకారులు, గులాబీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.