అధైర్యపడొద్దు ..రైతులకు అండగా ఉంటాం: టీ మంత్రులు

హనుమకొండ జిల్లా : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పంట నష్టం పరిశీలనకై బయల్దేరిన మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రజాప్రతినిధుల పరకాల నియోజకవర్గంలో బృందం వరంగల్ కు చేరుకుంది. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో పరకాల నియోజకవర్గంలోని పరకాల, నడికూడ మండలాల్లోని నాగారం, మల్లక్కపేట, నడికూడ గ్రామాలలో పర్యటించారు. వడగండ్ల వానల ప్రభావంతో నష్టపోయిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మంత్రుల పర్యటనలో బాధిత రైతులు మంత్రుల ఎదుట కన్నీరుమున్నీరుగా విలపించారు. కన్నీళ్లు పెట్టుకున్న బాధిత రైతులను మంత్రులు ఓదార్చారు. జరిగిన నష్టాన్ని నేరుగా తెలుసుకున్నారు.

దేశ పాలకుల అసంబద్ధ విధానాల మూలంగానే రైతులకు న్యాయం జరుగడం లేదని మంత్రులు దయాకర్ రావు, నిరంజన్ రెడ్డి విమర్శించారు. పరకాల నియోజకవర్గంలోని నష్టపోయిన పంట పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం వారు మాట్లాడారు. వ్యవసాయ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. దేశంలోనే రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది కేసీఆర్ సర్కార్ మాత్రమేనని తెలిపారు.

అకాల వర్షాలతో కొన్ని ప్రాంతాలలో దెబ్బతిన్న పంటల వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సేకరిస్తారని మంత్రులు పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యానికి జరిగిన పంట నష్టానికి రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు. పంట నష్టం తీరును సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చారు.

పరకాల నియోజకవర్గంలో నష్టపోయిన పంటలను పరిశీలిచిన వారిలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, నిరంజన్ రెడ్డిలతో పాటు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వ్యవసాయ కార్యదర్శి రఘునందన్ రావు , రైతు సమన్వయ బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు పలునూరి దయాకర్, మాలోతు కవిత , ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు చల్లా దర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి స్థానిక టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.