లవంగం అని లైట్ తీసుకోకండి..!
వరంగల్ టైమ్స్, హెల్త్ డెస్క్ : వంటగదిలో ఉండే లవంగాల్లో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ మాంగనీస్ కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక రకాల పోషకాలు లవంగాలలో లభిస్తాయి. అందుకే లవంగాలను అనేక రకాల వ్యాధులలో ఉపయోగిస్తారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో లవంగాలను నమలడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం.
కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది :
విటమిన్ ‘సి’,యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే లవంగాలను క్రమం తప్పకుండా తీసుకుంటే అది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఖాళీ కడుపుతో లవంగాలు తినడం వల్ల తెల్ల రక్త కణాలు పెరుగుతాయి. ఇది మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. దీంతో ఎలాంటి వ్యాధులు దరిచేరవు.
పంటి నొప్పి, తలనొప్పి నుండి ఉపశమనం :
అనాల్జేసిక్ గుణాలు లవంగాలలో ఉంటాయి. దీని వల్ల పంటి నొప్పికి తక్షణ ఉపశమనం లభిస్తుంది. చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంటే, లవంగంతో మౌత్ వాష్ కూడా చేయవచ్చు. పంటి నొప్పిలో మాత్రమే కాకుండా తలనొప్పికి కూడా లవంగం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. తలనొప్పిగా ఉన్నప్పుడు లవంగం వాసన చూసినట్లయితే ఉపశమనం కలుగుతుంది.
నోటి దుర్వాసనను తొలగిస్తుంది :
నోటిదుర్వాసనను తొలగించడంలో లవంగం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోట్లో నుంచి దుర్వాసన రాకుండా అడ్డుకుంటాయి. అంతేకాదు పంటి నొప్పితో బాధపడేవారు రోజుకో లవంగం చప్పరించడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది.
ఎముకలను దృఢంగా చేస్తుంది :
లవంగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల జాబితా చాలా పెద్దది. ఇది మన ఎముకలకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎముకలు బలహీనంగా ఉంటే ఉదయాన్నే నిద్రలేచి రెండు లవంగాల మొగ్గలు నమిలి తినాలి. లవంగాల్లో మాంగనీస్ అధిక మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలను బలంగా ఉంచుతుంది.