వాణీ జయరాం మృతిపై అనుమానాలు ?
వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : వాణీ జయరాం మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలు ఉండటంతో ఆమెది సహజ మరణమేనా లేక ఏమైనా కుట్ర జరిగిందా ? అని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. వాణి జయరాం ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మహిళా ఫ్లాట్ తలుపుతట్టగా లోపలి నుంచి స్పందన లేదు. ఆమె 5 సార్లు కాలింగ్ బెల్ కొట్టినా తలుపు తీయలేదు. దీంతో పనిమనిషి భర్త తన ఫోన్ లోంచి వాణీ జయరాం ఫోన్ కు కాల్ చేశాడు. ఐనా ఆమె ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అనుమానం వచ్చిన పనిమనిషి పోలీసులకు ఫోన్ చేసి, స్థానికుల సాయంతో గది తలుపులు బద్దలు కొట్టించింది. లోపలికి వెళ్లి చూడగా అప్పటికే వాణీ జయరాం స్పృహ లేకుండా లేకుండా కింద పడిపోయి ఉన్నారు. ఆమె ముఖంపై ఎవరో కొట్టినట్లుగా తీవ్ర గాయాలున్నాయి.
వెంటనే పనిమనిషి, స్థానికులు కలిసి ఆమెను ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి అప్పటికే మరణించినట్లుగా నిర్ధారించారు. పనిమనిషి, స్థానికుల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫ్లాట్ ను ఆధీనంలోకి తీసుకుని అన్ని ఆధారాలు సేకరిస్తున్నారు. ఫ్లాట్ లోని సీసీ ఫుటేజీని పరిశీలించిన తర్వాత అసలేం జరిగిందనే విషయాన్ని తెలుపనున్నారు పోలీసులు.