హైదరాబాద్ రోడ్లపై ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్
జెండా ఊపి ప్రారంభించిన సీఎస్ శాంతికుమారి
పాల్గొన్న మంత్రి కేటీఆర్,ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో చారిత్రక ప్రాధాన్యత ఉన్న డబుల్ డెక్కర్ బస్సులు మరోసారి వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ నగరంలో మరోసారి డబుల్ డెక్కర్ బస్సులు పరుగులుపెట్టనున్నాయి. మూడు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, సీఎస్ ఎ.శాంతికుమారి జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి కేటీఆర్ తో పాటు చేవెళ్ల ఎంపీ జి రంజిత్ రెడ్డి, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, ఎంఏ అండ్ యూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న ఫార్ములా ఇ-ప్రిక్స్ నేపథ్యంలో ఈ బస్సులు ప్రధానంగా ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, ప్యారడైజ్, నిజాం కాలేజీ స్ట్రెచ్‌లను కవర్ చేసే రేస్ ట్రాక్ చుట్టూ తిరుగుతాయి. ఫిబ్రవరి 11 తర్వాత పర్యాటక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ బస్సులను హెరిటేజ్ సర్క్యూట్‌లో ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తుంది.