ప్రీతి ఫ్యామిలీకి ఎక్స్ గ్రేషియా పెంపు
వరంగల్ టైమ్స్, జనగామ జిల్లా : మెడికో ప్రీతి మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్ ప్రీతి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబానికి భరోసాగా ఉంటామని హామి ఇచ్చారు. ఈ మేరకు మొదట రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. అయితే నిమ్స్ వద్ద ప్రీతి కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. దీంతో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు నేరుగా ప్రీతి తల్లిదండ్రులతో మాట్లాడి వారికి కీలక హామీలిచ్చారు.రూ. 30 లక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉన్నత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే ప్రీతి మృతిపై ఫాస్ట్రాక్ కోర్టుతో విచారణ జరిపిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అలాగే ప్రీతి మృతిపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.